కలం, ఖమ్మం బ్యూరో : ఒడిశా సరిహద్దు దాటేసి, ఎవరికీ అనుమానం రాకుండా మహారాష్ట్రకు భారీగా గంజాయి తరలించవచ్చని భావించిన స్మగ్లర్ల ప్లాన్ తలకిందులైంది. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ (Excise Enforcement), భద్రాచలం డీటీఎఫ్ (DTF) బృందాలు వేసిన ప్రత్యేక స్కెచ్‌తో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఈ మెరుపు దాడిలో రూ.1.82 కోట్ల విలువైన 365 కేజీల గంజాయితో పాటు ఓ లారీ, హ్యుందాయ్ కారు, బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు.
భద్రాచలం వీరభద్ర ఫంక్షన్ హాల్ సమీపంలో కొత్తగూడెం డీటీఎఫ్ బృందం నిఘా పెట్టి సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో మొదట బైక్‌పై వస్తున్న ఒడిశాకు చెందిన దివాకర్ మండల్ (22)ను ఆపి తనిఖీ చేయగా 9 కేజీల గంజాయి లభ్యమైంది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగానే వెనుక అనుమానాస్పదంగా వస్తున్న హ్యుందాయ్ కారును నిలిపి తనిఖీ చేశారు. అందులో ఏకంగా 100 కేజీల గంజాయి మూటలు బయటపడటంతో కారులో ఉన్న ఎలక్ట్రీషియన్ సుమన్ పాల్ (22)ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఇద్దరిని విచారించగా, తమ వెనుకే వస్తున్న మరో లారీలో కూడా భారీగా గంజాయి ఉందనే సమాచారాన్ని అధికారులకు అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఎక్సైజ్ బృందాలు కరుణగిరి వద్ద ఆగి ఉన్న ఒడిశా రిజిస్ట్రేషన్ లారీని గురిపెట్టి తనిఖీలు చేపట్టాయి. అందులో ఏకంగా 263.2 కేజీల గంజాయి లభ్యమైంది. లారీలో ఉన్న ఒడిశావాసులు రాజశేఖర్ మార్గి (22), క్లీనర్ బ్రిజన్ నాసా (20)లను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో కొత్తగూడెం డీటీఎఫ్ సీఐలు రమాదేవి, కిష్టయ్య, నరేందర్ రెడ్డితో పాటు ఎస్ఐలు సలీముల్లా ఖాన్, శ్రీధర్ రావు, సిబ్బంది కరీం, మౌలాంకర్, వీరబాబు, శ్రీనివాస్, నర్సింహరావు, రమేష్, పార్థసారధి, విల్సన్, సీతారాం, వీరభద్రం, రాకేష్, కిరణ్, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి భారీగా గంజాయిని పట్టుకున్న ఖమ్మం ఎక్సైజ్ బృందాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ అంజన్ రావు, ఖమ్మం డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

