కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు లేని వారికి సీటు ఎలా కేటాయించారని బీసీ జాగృతి సేన (BC Jagruthi Sena) రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మండిపడ్డారు. బుధవారం స్థానిక జిల్లా కేంద్రం లోని బీకే రెడ్డి కాలనీ లో బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించిందన్నారు.
పార్టీకి చెందిన, ప్రభుత్వ అనుసంధానమైన నామినేటెడ్ పోస్టుల తోపాటు చట్టబద్ధత కలిగిన మెజార్టీ పదవులన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులకు కట్టబెట్టడమే సామాజిక న్యాయమా అని కృష్ణ యాదవ్ ప్రశ్నించారు. అభ్యర్థుల ఎంపిక పునః పరిశీలించి బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీలంటే ఓట్లసే యంత్రాలు కాదని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేసి బీసీ వ్యతిరేకి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వేపూరి నరేందర్, దామోదర్, కుర్మూర్తి,శ్రీనివాస్, సాత్విక్, నరేందర్, అశోక్, అనిల్, జస్వంత్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

