రూ. 55 వేల కోట్లు రిలీజ్ చేయాలి.. సింగరేణి ధర్నాలో ఈటల ఫైర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికుల బ్రతుకులు నేడు సొంత రాష్ట్రంలో చీకటిమయమయ్యాయని బీజేపీ నాయకులు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో నిర్వహించిన “సింగరేణి ధర్నా”లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.55 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన రూ. 55,000 కోట్ల బకాయిలు రాకపోవడంతో, సింగరేణి సంస్థ సొంత నిధులు లేక 9% నుండి 12% వరకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చే దయనీయ స్థితికి చేరిందని ఈటల తెలిపారు. ఒకప్పుడు 1.16 లక్షలుగా ఉన్న పర్మినెంట్ కార్మికుల సంఖ్య నేడు 39 వేలకు పడిపోయిందన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ల స్వప్రయోజనాల కోసం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేయడాన్ని ఆయన నిరసించారు.

కోల్ ఇండియా తరహాలోనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు రూ.1,250 వేతనం ఇవ్వాలని, PAA నెపంతో కార్మికులపై సాగిస్తున్న డిస్మిస్ లు, వేధింపులు వెంటనే నిలిపివేయాలని ఈటల కోరారు. కార్మికులకు లాభాల్లో రావలసిన వాటాను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాసిరకం విద్యుత్ సరఫరా వల్ల రైతుల మోటార్లు కాలిపోతున్నాయని, విద్యుత్, సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.​

గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ సింగరేణికి, తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశాయని ఈటల విమర్శించారు. ​”సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం బీజేపీ అండగా ఉంటుంది. ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు చెల్లించే వరకు మా పోరాటం ఆగదు.” అని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ​ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, స్థానిక నాయకులు, వేలాది మంది సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>