కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాంపౌండ్ ఆర్చరీ, ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించి దేశకీర్తిని విదేశాల్లో రెపరెపలాడించారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన విజేతలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆర్చరీ విభాగంలో భారత కాంపౌండ్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తొలుత మహిళల జట్టులో చికిత తనిపర్తి, ప్రీతిక ప్రదీప్, జ్యోతి సురేఖ వెన్నం చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్‌లో చికిత, సాహిల్ రాజేష్ జంట పసిడి పతకం సాధించి, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోటాను కూడా ఖరారు చేసుకుంది.

