కలం, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని మంగళూరు రీఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (Mangaluru MRPL) ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన నల్లటి పొగలు అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర శబ్దం వినిపించింది. సమీపంలోని జోకట్టె గ్రామ్ పంచాయతీ భవనంతో పాటు చుట్టుపక్కల నివాసాలు తీవ్రంగా కంపించాయి. అనేక ఇళ్ల తలుపులు, కిటికీ అద్దాలు ఊడిపడినట్లు బాధితులు తెలిపారు. పేలుడు ధాటికి మంగళూరు విమానాశ్రయం పరిసరాల్లోనూ కిటికీ అద్దాలు పగిలిపోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవా విభాగాలు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఆస్తి లేదా ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

