కలం, వెబ్ డెస్క్ : దేశంలో ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా పాత పద్ధతిలోనే, బ్యాలెట్ పేపర్ ద్వారా జరపాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ , అలాగే ‘ఇండియా’ కూటమికి చెందిన ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఈ కీలక సమావేశంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బ్యాలెట్ విధానమే ఏకైక మార్గమని ‘ఇండియా’ కూటమి నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని కూటమి నేతలు ఆరోపించారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓటర్ల హక్కులను కాలరాస్తుందని.. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

