కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్.. ప్రతిపక్షాల వ్యూహం ఏంటి?

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల స్థానానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డిని ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రెండుచోట్లా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకే అవకాశం ఇచ్చింది.

నల్లగొండ స్థానానికి పీవీ శ్రీనివాస్ (ఆర్టీఐ కమిషనర్) పేరును ఖరారు చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ సర్వోత్తమ్ రెడ్డి పేరు ఖరారైంది. ప్రస్తుతం ఈ రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఉన్నవారి పదవీకాలం వచ్చే సంవత్సరం మార్చిలో ముగియనున్నది. ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. రెండు స్థానాల్లో సుమారు 5 లక్షల మంది చొప్పున గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం నల్లగొండ స్థానంలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), హైదరాబాద్ స్థానంలో వాణిదేవి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీలుగా ఉన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా బీసీ రాజ్యాధికార పార్టీని స్థాపించుకున్నారు. కాంగ్రెస్ రెండు చోట్లా రెడ్డి కమ్యూనిటీకి చెందినవారిని అభ్యర్థులుగా ప్రకటించడంతో తీన్మార్ మల్లన్న బీసీ అస్త్రాన్ని అందుకోడానికి మార్గం సుగమమైంది.

ప్రతిపక్షాల నుంచి ఎవరు?

నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల సీటుకు బీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డిని ఖరారు చేసే అవకాశమున్నది. హైదరాబాద్ స్థానానికి బీసీ అభ్యర్థిని నిలబెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ స్థానానికి బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు (ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్)ను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నల్లగొండ స్థానం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>