కలం ,వెబ్ డెస్క్ : ఆధ్యాత్మిక గురువుగా ప్రసిద్ధి చెందిన కల్కి భగవాన్ (Kalki Bhagawan) (77) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత 10 రోజులుగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భక్తుల్లో విషాదం నెలకొంది.
బత్తవల్లంలోని ఏకం టెంపుల్‌కు పార్థివదేహం
కల్కి భగవాన్ పార్థివదేహాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలపల్లిలోని ఏకం టెంపుల్‌కు (Ekam Temple) తరలించనున్నారు. అక్కడ భక్తుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనను చివరిసారిగా దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.
శనివారం అంత్యక్రియలకు ఏర్పాట్లు
కల్కి భగవాన్ అంత్యక్రియలను శనివారం ఏకం టెంపుల్ ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే ప్రాంగణంలో ఆయన జ్ఞాపకార్థం స్మారకాన్ని నిర్మించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు, ఆయన అనుచరులు పర్యవేక్షిస్తున్నారు.
ఉపాధ్యాయుడి నుంచి ఆధ్యాత్మిక గురువుగా
కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా, అనంతరం ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేశారు. 1992లో తాను ‘కల్కి అవతారం’ అని ప్రకటించుకుని ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించారు. అనంతరం అమ్మ భగవాన్‌తో కలిసి ధ్యానం, ముక్తి దీక్ష తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆధ్యాత్మిక బోధనలు, ధ్యాన కార్యక్రమాల ద్వారా ఆయనకు దేశ, విదేశాల్లో అనుచరులు ఏర్పడ్డారు. ఆయన మరణవార్తతో భక్తులు, అనుచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

