కలం, నల్లగొండ: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నవీకరించిన జ్ఞానాన్ని అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుందని రాష్ట్ర విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ‘ఉదయాదిత్య భవన్’లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన బోధన” అనే అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ (Nalgonda AI Workshop) నిర్వహించారు.
ఈ వర్క్‌షాప్‌కు ఎంఈఓలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎమ్మార్పీలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)లు హాజరవ్వగా.. పార్థసారథి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికతతో బోధనా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. ఏఐ అనేది ఒక శక్తివంతమైన ఆయుధమని, వృత్తి జీవితంలో దీన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంతటి ఫలితం ఉంటుందన్నారు. పసిపిల్లల మనస్తత్వాన్ని ఏఐ సరిగ్గా అంచనా వేయలేదని, కానీ ఉపాధ్యాయుడు వారి మనసును సులభంగా అర్థం చేసుకోగలరని చెప్పారు.
ఉపాధ్యాయుడి మేధస్సుకు ఏఐ సాంకేతికత తోడైతే క్వాలిటీ విద్యను అందించవచ్చని స్పష్టం చేశారు. ఏఐపై సరైన అవగాహన లేకపోతే సాంకేతికత తెలిసిన వారు ఎదుటివారిని మోసం చేసే అవకాశముందని, ఉపాధ్యాయులు ఏఐని అవపోసన పట్టి సమాజ మార్పునకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం (Nalgonda AI Workshop)లో కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్ రావు, రిసోర్స్ పర్సన్ లక్ష్మీనాథం తదితర విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

