కలం, మంథని: అధికారం కోసం ఇచ్చిన హమీలను అమలు చేయాలని అడిగితే అక్రమ కేసులు పెట్టించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) సెటైరికల్ కామెంట్స్ చేశారు. మంగళవారం పలు కేసులపై మంథని కోర్టులో నాయకులు, కార్యకర్తలతో హజరైన ఆయన మాట్లాడుతూ.. మానీఫెస్టో కమిటి చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఆరు గ్యారంటీలు, 420హమీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హమీలు అమలు చేయాలని కోరితే అక్రమంగా కేసులు పెట్టిస్తూ ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంతో పాటు మంథనిలో నియంత పాలన కొనసాగుతుందని, ఇందుకు తమపై నమోదైన అక్రమ కేసులే నిదర్శనమని పుట్ట మధూకర్ అన్నారు. మూడేళ్ల ప్రజాపాలనలో ప్రజలకు తీరని అన్యాయమే జరుగుతుందని, ప్రశ్నించేవారి నోరు మూయించేలా పోలీసులను అడ్డం పెట్టుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన మానీఫెస్టోలోని హమీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

