నల్లగొండలో గుట్టుచప్పుడు కాకుండా SGSF క్రికెట్ ఎంపికలు..!

కలం, నల్లగొండ : పాఠశాల క్రీడా సమైక్య నల్లగొండ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియ (Nalgonda Cricket Selections) వివాదాస్పదంగా మారింది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఎంపిక పోటీలు నిర్వహించడంపై స్థానిక క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ఎస్జిఎఫ్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లీక్ చేయకుండా, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ నిర్వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతేడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ఎంపిక పోటీలకు, ఈసారి మాత్రం కేవలం 20 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు మాత్రమే హాజరు కావడం గమనార్హం. ఇంత తక్కువ మందితో ఎంపికలు పూర్తి చేయడం వెనుక పెద్ద మర్మమే ఉందని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. బడా బాబుల పిల్లలకే స్థానం కల్పించేలా, అధికారులు భారీగా కలెక్షన్లు చేసుకుని రహస్యంగా ఈ నాటకానికి తెరదీశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇచ్చిన వారికే ఎంపిక పక్కా చేశారని, అర్హులైన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు సమాచారం అందకుండా ముందస్తు పథకం ప్రకారమే ఎంపిక ప్రక్రియను పరిమితం చేశారని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని క్రీడా వర్గాలు మండిపడుతున్నాయి. క్రీడాకారులకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఎంపికలను ఇంత రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ ఎస్జిఎఫ్ క్రికెట్ సెలక్షన్స్‌ (Nalgonda Cricket Selections) పై పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని, రహస్యంగా జరిపిన ఈ ఎంపికలను తక్షణమే రద్దు చేయాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని, సమగ్ర విచారణ జరిపించి నిజమైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>