కలం, జోగులాంబ గద్వాల: కోర్టుల్లో కేసులు ఉన్న కక్షిదారులు సమయం, ఖర్చు ఆదా చేసుకునేందుకు మధ్యవర్తిత్వాన్ని సద్వినియోగం చేసుకుని వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.నిష్కా పత్రుడు సూచించారు.
కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వ ప్రచార (Mediation Campaign) కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టు హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.నిష్కా పత్రుడు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే విషయాలను కూలంకషంగా వివరించారు.
సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 89 కింద ఉన్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల్లో మధ్యవర్తిత్వం ఒకటని తెలిపారు. మధ్యవర్తిత్వంలో ఒక తటస్థ వ్యక్తి ఇరు పక్షాలతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకుని, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేలా సహకరిస్తారని వివరించారు. మధ్యవర్తి ఎవరి పక్షానా ఉండరని, ఎలాంటి నిర్ణయాన్ని బలవంతంగా రుద్దరని, చివరి నిర్ణయం ఇరు పక్షాల అంగీకారంతోనే జరుగుతుందన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం 15 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. వైవాహిక వివాదాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ వివాదాలు, డబ్బు సంబంధిత వివాదాలు, వ్యాపార వివాదాలు తదితర రాజీకి అవకాశం ఉన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.
కోర్టులో కేసు ఉన్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకోవాలని కోరితే, నిబంధనల ప్రకారం మధ్యవర్తిని నియమించి ఇరుపక్షాలతో చర్చలు జరిపే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే రాజీకి అవకాశం ఉన్న కేసులను న్యాయమూర్తి మధ్యవర్తిత్వానికి పంపవచ్చని, ఇరువర్గాలు కూడా విజ్ఞప్తి ద్వారా ఈ అవకాశాన్ని కోరవచ్చని తెలిపారు.
మధ్యవర్తిత్వం కోరిన కక్షిదారులకు నిబంధనల ప్రకారం మధ్యవర్తిని నియమిస్తామని తెలిపారు. మధ్యవర్తి ఇరువర్గాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదిరేలా సహకరిస్తారని వివరించారు. మధ్యవర్తిత్వ సమయంలో వెల్లడించిన విషయాలను ఒక పక్షానికి వ్యతిరేకంగా ఉపయోగించలేరని స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ సమస్యలను మధ్యవర్తి ముందు వివరించుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2,000 కేసులను మధ్యవర్తిత్వానికి అనుకూలమైనవిగా గుర్తించగా, 148 కేసులను ఇప్పటికే న్యాయమూర్తికి పంపించినట్లు తెలిపారు.
అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించే ప్రచార కార్యక్రమంలో మరిన్ని కేసులను మధ్యవర్తిత్వానికి పంపించి, వీలైనన్ని కేసులను సత్వరంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరు పక్షాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని వివరించారు. కాబట్టి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు కోర్టుల్లో కేసులు ఉన్నప్పుడు రాజీకి అవకాశం ఉన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

