బడంగ్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం: ట్రాక్టర్ కిందపడిన మహిళ

కలం, వెబ్ డెస్క్ : బడంగ్‌పేట్ (Badangpet) పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాక్టివాపై వెళ్తున్న ఓ మహిళా వాహనం అదుపుతప్పి కిందపడటంతో, పక్కనే వెళ్తున్న ట్రాక్టర్ ఆమెపై నుంచి వెళ్లిన ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్‌గుల్‌ ప్రాంతానికి చెందిన ప్రసన్నలక్ష్మి (29) అనే మహిళ తన యాక్టివా ద్విచక్రవాహనంపై అల్మాస్‌గూడ వైపు వెళ్తోంది. మారుతీనగర్ వద్దకు చేరుకోగానే ఎదురుగా ఆకస్మికంగా ఒక ఆటో వచ్చింది. దానిని తప్పించే క్రమంలో ప్రసన్నలక్ష్మి తన వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోయింది.

అదే సమయంలో ఆమె పక్క నుంచే వెళ్తున్న ఒక ట్రాక్టర్ వెనుక టైరు ప్రసన్నలక్ష్మి తలపై నుంచి వెళ్ళింది. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ప్రమాదం జరగగానే ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Also Read : నీరు ధండా బంగారు గురి.. భారత్‌కు మరో గోల్డ్ మెడల్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>