కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శివుడు ‘పేదల దేవుడు’ అని, రాముడిని ‘ధనవంతుల దేవుడు’ అంటూ ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఈ మధ్య పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆయన్ని మంచి డాక్టర్ కు చూపించాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు (Ramchander Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ప్రాంతీయ, మతపరమైన విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
దేవుళ్ల విషయంలో రేవంత్ రెడ్డి విపరీతమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని, రాముడైనా లేదా శివుడైనా పేదల దేవుళ్లేనని రామచందర్ రావు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీ (వారణాసి) స్థానంలో స్వయంగా శివుడు పరమేశ్వరుడే కొలువై ఉన్నారని, అలాంటిది బీజేపీ శివుడిని కాదని కేవలం రాముడినే పూజిస్తుందనడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి పరాకాష్ట అని విమర్శించారు.
దేవుళ్లను వర్గాలుగా, ప్రాంతాలుగా విభజించి మాట్లాడటం హిందూ సమాజాన్ని అవమానించడమేనని రామచందర్ రావు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంతంగా ఈ వ్యాఖ్యలు చేయడంలేదని, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకే పనిచేస్తూ సమాజాన్ని విడదీసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. దేవుళ్లపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

