‘ఛలో సిరిసిల్ల’ను విజయవంతం చేయండి.. కాంగ్రెస్ శ్రేణులకు పొన్నం పిలుపు!

కలం, ​రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలపై ఒక్క రూపాయి పన్నుల భారం వేయకుండా ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పరుగులు తీయిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి సిరిసిల్లకు రానున్న నేపథ్యంలో, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి “ఛలో సిరిసిల్ల” (Chalo Sircilla) ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

​రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో గడిచిన 33 నెలలుగా తెలంగాణలో ప్రజాపాలన సాగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం రైతాంగం, చేనేత-కార్మికులు, విద్యార్థుల సంక్షేమానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

​ప్రతిపక్షాల కుళ్ళు రాజకీయం:

రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి విచ్ఛిన్నకర విధానాలను అవలంబిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వర్షాలు పడకపోయినా, ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడినా, సంక్షేమ పథకాలపై కోర్టు స్టే వచ్చినా సంతోషపడే నీచమైన రాజకీయ సంస్కృతి బీఆర్ఎస్ ది అని విమర్శించారు.

వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సి ఉండగా, ప్రతిపక్షాలు దానిపై కూడా చవకబారు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలు, ప్రభుత్వం పూజలు చేస్తూ పాజిటివ్‌గా ముందుకు వెళ్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం నెగిటివ్‌ ఆలోచనలతో ఉన్నాయని పేర్కొన్నారు.

​ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగించేలా, రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా ముఖ్యమంత్రి సిరిసిల్ల వేదిక నుంచే ఒక బలమైన సందేశాన్ని ఇవ్వనున్నారని తెలిపారు. సీఎం రాకతో బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

​పన్నుల భారం లేకుండా సంక్షేమ ఫలాలు:

విద్యుత్ ఛార్జీలు కానీ, ఇతర ఏ విధమైన పన్నుల భారం ప్రజలపై వేయకుండానే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను తీసుకొచ్చామని గుర్తుచేశారు. ​​విధ్వంసకర రాజకీయాలు స్వస్తి చెప్పి, బాధ్యతగల ప్రతిపక్షంగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, తమ ప్రవర్తనను మార్చుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ “ఛలో సిరిసిల్ల” కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>