కలం, వెబ్ డెస్క్: గుంటూరు (Guntur) నగరంలోని సంగడిగుంట పొన్నూరు రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనమైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి గాయాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. సంగడిగుంటకు చెందిన హరికృష్ణ తన కొడుకు అఖిలేష్లో కలిసి ఆసుప్రతికి వెళ్తున్నాడు. అయితే సంగడిగుంట ప్రాంతానికి రాగానే కారులో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించడంతో అఖిలేష్ కారు డోర్ తీసుకుని బయటకు వచ్చాడు. కానీ తండ్రి వైపు ఉన్న డోర్ తెరుచుకోకపోవడంతో ఆయన కారులోని మంటల్లో చిక్కుకున్నాడు. కొడుకు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ కాకపోవడంతో తండ్రి మంటల్లో సజీవ దహనం అయ్యాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

