కలం, వెబ్ డెస్క్ : ఫార్ములా E రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)కు ఏసీబీ కోర్టులో ఊహించని షాక్ తగిలింది. విదేశీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.55 కోట్లు కట్టబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన దేశం దాటి వెళ్లకుండా పాస్‌పోర్టును సీజ్ చేయాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. ఈ మేరకు కేసు విచారణ పూర్తయ్యే వరకు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆయన పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి (RPO) కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో ఇకపై కేటీఆర్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీలుండదు. ఇటీవల దాదాపు నెల రోజుల పాటు అమెరికా పర్యటనను ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఆయన మళ్లీ విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని భావించిన అధికారులు, దర్యాప్తునకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

