కలం, వనపర్తి: రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు రీ సర్వేతో శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం హామీ మేరకు ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు, ఎల్పీఎం నంబర్, జియో కోఆర్డినేట్స్‌తో కూడిన మ్యాప్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తొలి దశలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని తెలిపారు. నక్షాలు అందుబాటులో లేని మరో 413 రెవెన్యూ గ్రామాల్లోనూ దశలవారీగా సమగ్ర సర్వే చేపడతామని వెల్లడించారు.
ఆధునిక పరికరాలతో సర్వే..
భూ సర్వేను వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. తొలి దశలో కొనుగోలు చేసిన రోవర్లతో పాటు రెండో దశలో అదనపు పరికరాలను జిల్లాల అవసరాలకు అనుగుణంగా అందిస్తున్నామన్నారు. వేలాది మంది సర్వేయర్లకు లైసెన్సులు మంజూరు చేసి క్షేత్రస్థాయిలో సర్వేను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండి రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేలా సర్వేయర్లు పనిచేయాలని సూచించారు. సాదాబైనామాలు, భూ హద్దుల వివాదాలు, పాత రికార్డుల్లో లోపాలు, అబాది ఆస్తుల వివరాలు వంటి సమస్యలకు సమగ్ర సర్వేతో పరిష్కారం చూపవచ్చన్నారు. సాగులో ఉన్నప్పటికీ సరైన టైటిల్ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల సమస్యలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
అబాది ఆస్తులకు మ్యాపింగ్..
గ్రామాల్లోని ఇళ్ల స్థలాలు, నివాస ప్రాంతాలు, అబాది ఆస్తుల విస్తీర్ణంపై గతంలో స్పష్టమైన మ్యాపింగ్ లేని సందర్భాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇకపై సర్వే ద్వారా ఆయా ఆస్తుల విస్తీర్ణం, హద్దులను నిర్ధారించి మ్యాప్‌తో సహా రికార్డుల్లో నమోదు చేస్తామని చెప్పారు. అబాది, వ్యవసాయేతర భూములకు ప్రత్యేక రికార్డులు నిర్వహించి, వాటి మూలలను జియో కోఆర్డినేట్లతో మ్యాప్ చేసేందుకు భూ భారతి చట్టంలో నిబంధనలు ఉన్నాయని వివరించారు.
పేదల ఇళ్లకు ప్రాధాన్యం..
భూ సమస్యల పరిష్కారంతో పాటు పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పేదల ఇళ్లకు రెండో విడతలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. రెండో విడతలో అవకాశం రాని అర్హులైన పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడు, నాలుగో విడతల్లో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

