విద్యార్థి సంఘాలకు ఎన్నికలు.. కూనంనేని వినూత్న డిమాండ్

కలం, హనుమకొండ: శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థులు పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల (AISF 90th Anniversary) సందర్భంగా సోమవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌ నుంచి కాకతీయ యూనివర్సిటీ ( Kakatiya University) ఆడిటోరియం వరకు వేలాది మంది విద్యార్థులతో మహా ప్రదర్శన నిర్వహించారు.

భగత్‌సింగ్‌ వారసత్వంతో ఏఐఎస్ఎఫ్‌..

అనంతరం కేయూ ఆడిటోరియంలో జరిగిన బహిరంగ సభలో కూనంనేని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్‌కు 90 ఏళ్ల చరిత్ర ఉందని, స్వాతంత్య్ర  ఉద్యమ కాలంలో విద్యార్థుల హక్కులు, దేశ స్వాతంత్య్రం, శాస్త్రీయ విద్య లక్ష్యాలతో సంఘం ఏర్పడిందన్నారు. భగత్‌సింగ్‌ వారసత్వంతో ఏఐఎస్ఎఫ్‌ కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యారంగంలో పలు సమస్యలు ఉన్నాయని, విద్యార్థులను ప్రభావితం చేసే విధానాలు అమలవుతున్నాయని అన్నారు. విద్యారంగంలో కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈసీని పదవి నుంచి తొలగించాలి..

విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా భవిష్యత్‌ నాయకత్వం తయారవుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి భగత్‌సింగ్‌ వంటి నాయకుల స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగి రాజన్ మాట్లాడుతూ పాలకుల విధానాలను మార్చే శక్తి విద్యార్థులకు ఉందన్నారు. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. సభలో ప్రజానాట్యమండలి కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>