కలం, జనగామ: ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జనగామ (Jangaon) మండలం యెల్లంల (Yellamla) గ్రామానికి చెందిన బొమ్మ రాజు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదంటూ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, అక్కడున్న గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై అడ్డుకున్నారు.
తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉందనే కారణంతోనే తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదని రాజు ఆరోపించారు. అయితే తన కుమారుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని ఆయన తెలిపారు. ఘటనపై అధికారులు స్పందించి, తన అర్హతను పరిశీలించి న్యాయం చేయాలని రాజు కోరారు. గ్రామస్తులు కూడా ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

