‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కాదు.. ‘ఫేక్‌ ఇన్‌ ఇండియా’: ఎంపీ వంశీకృష్ణ

కలం, ​పెద్దపల్లి: తెలంగాణ రైతాంగానికి కీలకమైన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)లో పదేపదే యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు యూరియా అత్యంత అవసరమైన సమయంలో ఫ్యాక్టరీ మళ్లీ షట్‌డౌన్ (RFCL Shutdown) కావడంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. కేంద్ర కిషన్‌రెడ్డికి డైరెక్ట్ ఛాలెంజ్ విసురుతూ.. ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని వెంటనే నోయిడా నుంచి రామగుండానికి తరలించాలని డిమాండ్ చేశారు.

‘మేక్‌ ఇన్‌ ఇండియా’నా.. ‘ఫేక్‌ ఇన్‌ ఇండియా’నా?

బీజేపీ, మోదీ ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అని గొప్పలు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు కీలకమైన యూరియా ఫ్యాక్టరీని సక్రమంగా నడపలేకపోతోందని వంశీకృష్ణ విమర్శించారు. “రైతులకు యూరియా అవసరమైన సమయంలో రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పదేపదే బంద్ కావడం కేంద్ర నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’నా లేక ‘ఫేక్ ఇన్ ఇండియా’నా?” అని (MP Gaddam Vamsi Krishna) ప్రశ్నించారు.

కాకా, వివేక్‌ల కృషితో రూ.10,000 కోట్ల రుణ పరిష్కారం

తెలంగాణ రైతులకు సొంతంగా యూరియా అందుబాటులో ఉండాలనే ముందుచూపుతో కాకా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి ఎంతో కృషి చేశారని ఎంపీ గుర్తుచేశారు. సుమారు రూ.10,000 కోట్ల రుణభారంతో ఉన్న సంస్థను ఆదుకుని, పునరుద్ధరణకు బాటలు వేశారని తెలిపారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీని నేడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేకపోవడం శోచనీయమన్నారు.

​కిషన్‌రెడ్డికి డైరెక్ట్ ఛాలెంజ్..

“కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీకు తెలంగాణ రైతులపై నిజంగా ప్రేమ ఉంటే.. ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని నోయిడా నుంచి వెంటనే రామగుండానికి మార్చండి” అని ఎంపీ వంశీకృష్ణ సవాల్ విసిరారు. నిర్వహణ కార్యాలయం స్థానికంగా ఉంటేనే ఫ్యాక్టరీ సమస్యలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

​100% సామర్థ్యంతో నడపాలి

సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను సురక్షితంగా, నిరంతరాయంగా 100 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పటికే తాను పలుమార్లు సీఎండీని కలిసి సమస్యలను వివరించినట్లు తెలిపారు. రైతులకు సమయానికి యూరియా అందించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>