కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు (MLC Elections) జరగనున్న వేళ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఈరోజు నుంచే అధికారికంగా ప్రారంభమైంది.
ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. 2026 నవంబర్ 1 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం పూర్తిగా కొత్తగా సిద్ధం చేస్తున్నందున, గతంలో ఓటు హక్కు ఉన్న పాత ఓటర్లు కూడా తప్పనిసరిగా ఫామ్–18 ద్వారా మళ్లీ అప్లై చేయాల్సి ఉంటుంది.
అర్హులైన పట్టభద్రులు తమ దరఖాస్తులను తెలంగాణ రాష్ట్ర సీఈఓ అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ఫామ్-18 పూరించి సంబంధిత డిగ్రీ సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నింపిన ఫారాన్ని నేరుగా ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ అధికారులకు అందజేయవచ్చు. ఈ ఓటరు నమోదు ప్రక్రియకు నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : తెలంగాణలో ఎలక్షన్ హీట్.. మూడు పార్టీల మాస్టర్ ప్లాన్స్!
Follow Us On : WhatsApp

