కలం, నేషనల్ డెస్క్ : దేశంలో పార్టీ ఫిరాయిస్తున్న (Political Defections ) ప్రజాప్రతినిధులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. 2022 నుంచి 2026 వరకు నాలుగేళ్లలో 111 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము గెలిచిన పార్టీలను వీడి వేరే పార్టీల్లోకి మారినట్లు తెలిపింది. ఇందులో 26 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో 26 శాతం మంది ప్రజాప్రతినిధులు బీజేపీలోనే చేరారు.
ఆ మూడు పార్టీల్లోకే 73% మంది..
దేశంలో ఫిరాయింపు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని చేర్చుకున్న పార్టీగా నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ నిలిచింది. ఇందులో ఒక పార్టీ విలీనం కారణంగా ఏకంగా 32 మంది (29 శాతం) చట్టసభ సభ్యులు చేరారు. ఇక బీజేపీలోకి 29 మంది (26 శాతం) చేరారు. నేషనల్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో 20 మంది చేరారు. దాదాపు 73 శాతం మంది చట్టసభ సభ్యులు ఈ మూడు పార్టీల్లోకే మారడం గమనార్హం. బీజేపీలో చేరిన 29 మందిలో ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యులు, 22 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆ పార్టీల నుంచే ఎక్కువ ఫిరాయింపులు
ఈ పార్టీ ఫిరాయింపులు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగాయని ఏడీఆర్ తెలిపింది. అత్యధికంగా నాగాలాండ్‌లో 32, పశ్చిమ బెంగాల్‌లో 20, తెలంగాణలో 9, గోవా, పంజాబ్‌లలో 8 మంది చొప్పున నాయకులు పార్టీలు మారారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు ఎన్‌సీపీఐలో విలీనం అయ్యారు. ఏ పార్టీల నుంచి నాయకులు ఎక్కువగా బయటకు వెళ్లారనే జాబితాను కూడా ఏడీఆర్ ప్రకటించింది. ఇందులో ఎండీపీపీ నుంచి 25 మంది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ నుంచి 9 మంది, ఆప్, ఎన్సీపీ నుంచి ఏడుగురు చొప్పున, శివసేన నుంచి ఆరుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, ఎన్‌పీపీ నుంచి నలుగురు వెళ్లిపోయారు. ఈ ఫిరాయింపులతోనే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయాయని నివేదిక స్పష్టం చేసింది.
పదో షెడ్యూల్ సవరించాలని సూచన
ఈ రాజకీయ ఫిరాయింపుల సంస్కృతిని అరికట్టడానికి ఏడీఆర్ కొన్ని కీలక సిఫార్సులు చేసింది. ఫిరాయింపులపై అనర్హత వేటు నిర్ణయాలను సభాపతులకు బదులుగా ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి లేదా గవర్నర్లు తీసుకునేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సవరించాలని సూచించింది. అలాగే ఫిరాయింపుదారులు ప్రభుత్వ పదవులు చేపట్టకుండా కఠినమైన నిబంధనలు పెట్టాలని డిమాండ్ చేసింది. కేవలం సాధారణ ఫిరాయింపులే కాకుండా, పార్టీల అధికారిక విలీనాలు, రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో గెలవడం, అనర్హత వేటు తదితర నాలుగు విభిన్న పద్ధతుల ద్వారా ఈ మార్పులు జరిగినట్లు ఏడీఆర్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే అధికారిక డేటా లభ్యత తక్కువగా ఉండటం వల్ల ఈ జాబితా పూర్తిగా సమగ్రమైనది కాకపోవచ్చని కూడా ఏడీఆర్ పేర్కొంది.

