కలం, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్‌తో పాటే హుజూరాబాద్‌కూ (Huzurabad Bypoll) ఉప ఎన్నిక రానున్నదా? దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడడంతో, దానికి కౌంటర్‌గా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తేనున్నదా? బీఆర్ఎస్ ఫోకస్ మొత్తం ఖైరతాబాద్ సీటుపైనే ఉండకుండా హుజూరాబాద్‌కూ షిఫ్ట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నదా?.. ఇలాంటి ప్రశ్నలకు పొలిటికల్ సర్కిళ్లలో ఔను అనే జవాబే వస్తున్నది.
అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైగలతో బెదిరించడం, అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం.. ఇప్పటికే కమిటీ మూడుసార్లు సమావేశమై దీనిపై లోతుగా చర్చించడంతో అనర్హత వేటు ఖాయమన్న చర్చ జరుగుతున్నది.
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖరారు కావడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోడానికి బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలందరినీ ఇక్కడికి తరలించడం, ప్రతి ఇంటినీ టచ్ చేసేలా కార్యకర్తలకు డ్యూటీ అప్పగించడం, పోలింగ్ బూత్‌ల వారీగా బాధ్యతలు ఇవ్వడం, ప్రతి వార్డుకు ఇన్‌చార్జులను, కోఆర్డినేటర్లను నియమించడం.. ఇలా పకడ్బందీ మెకానిజం రూపొందించుకుంటుంది. పార్టీ ఫోకస్ మొత్తం ఖైరతాబాద్ మీదనే ఉంటుంది.
అయితే దీన్ని గమనించిన కాంగ్రెస్ .. కౌంటర్ స్ట్రాటజీని రూపొందిస్తున్నది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని సిఫారసు చేసే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ నిర్ణయాన్నే స్పీకర్ ప్రకటించినట్లయితే హుజూరాబాద్‌కు సైతం ఉప ఎన్నిక వచ్చే అవకాశముంటుంది. దీంతో బీఆర్ఎస్ సహజంగానే ఆ సిట్టింగ్ స్థానాన్ని కూడా నిలబెట్టుకునేందుకు కష్టపడాల్సి వస్తుంది.
రెండు చోట్లా ఓడించాలని టార్గెట్
దానం నాగేందర్‌పై అనర్హత వేటు విషయంలో క్రెడిట్ కొట్టేసిన బీఆర్ఎస్‌ను నైతికంగా దెబ్బతీయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక తేవడం ద్వారా బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ ఇవ్వాలని అనుకుంటున్నది. దీంతో ఏక కాలంలో ఇటు ఖైరతాబాద్, అటు హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితిని సృష్టించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
రెండు సిట్టింగ్ స్థానాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల్ని సృష్టించి, ఆ పార్టీ వాటిని కోల్పోయేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నది. ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ స్థానాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఖైరతాబాద్, హుజూరాబాద్ లను సైతం కైవశం చేసుకుని బీఆర్ఎస్‌ను నైతికంగా దెబ్బతీయాలనుకుంటున్నది. ఒకవైపు బీఆర్ఎస్ నేతల భూములపై ప్రభుత్వం ఎంక్వయిరీ జరిపిస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఇలాంటి సమయంలో రెండు ఉప ఎన్నికలపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టడానికి బదులు డిఫెన్సులో పడతారని కాంగ్రెస్ భావిస్తోంది.
నవంబర్ తర్వాతే క్లారిటీ
ఎథిక్స్ కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశమై పాడి కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనపై చర్చించింది. పూర్తిస్థాయి వీడియో ఫుటేజీ చూసిన తర్వాతే స్పష్టమైన వివరణ ఇస్తానంటూ ఆయన ఆరు వారాల గడువు కోరారు. ఆ ప్రకారం అక్టోబర్ చివరి నాటికి కౌశిక్ రెడ్డి నుంచి ఎథిక్స్ కమిటీ వివరణ తీసుకోనున్నది. ఆ తర్వాతే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది స్పష్టత రానున్నది. ఓటర్ల తుది జాబితా నవంబర్ 9న విడుదల కానున్న నేపథ్యంలో, అప్పటి వరకు ఎథిక్స్ కమిటీ నివేదిక ఫైనల్ కానున్నది. నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుందా? లేక సెషన్‌లో టేబుల్ చేస్తుందా?.. అనే అంశాలు పాడి కౌశిక్ రెడ్డి రిప్లై ఇచ్చిన తర్వాతే స్పష్టం కానున్నాయి.

