కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం (Bhadrachalam Godavari) నమోదు విషయంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), రాష్ట్ర నీటిపారుదల శాఖల మధ్య స్పష్టత కొరవడటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీపై గందరగోళం నెలకొంది. గతంలో ఏ శాఖ అధికారులు రీడింగ్ తీసినా లెక్కలు ఒకేలా వచ్చేవి. అయితే గత ఏడాది కాలంగా సీడబ్ల్యూసీ, ఇరిగేషన్ శాఖల మధ్య రెండు మూడు అంగుళాల మేర వ్యత్యాసం కనిపిస్తూనే ఉంది. తాజాగా ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం గోదావరి నీటి మట్టం 43.2 అడుగులకు చేరింది. నిబంధనల ప్రకారం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి ఉండగా, ఇరిగేషన్ శాఖ నివేదికలో మాత్రం నీటి మట్టం 42.8 అడుగులుగానే నమోదైంది.
సాధారణంగా సీడబ్ల్యూసీ స్థానిక కార్యాలయ సిబ్బంది నమోదు చేసిన నివేదికను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి పంపుతారు, దీనినే అధికారికంగా పరిగణనలోకి తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు నీటిపారుదల శాఖ సిబ్బంది తమ రీడింగ్‌ను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తారు. అయితే ఇటీవలే కొంతకాలంగా కలెక్టర్‌కు అందే ఇరిగేషన్ శాఖ రీడింగ్‌నే అధికారులు ప్రామాణికంగా తీసుకుంటూ వరద హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వాతావరణ హెచ్చరికల్లో భాగంగా ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదుకానుందో ఐఎండి ఇచ్చే నివేదికల ఆధారంగా నది నీటి మట్టం ఎంత పెరగొచ్చనే ముందస్తు అంచనాలను సీడబ్ల్యూసీ స్థానిక యంత్రాంగానికి అందిస్తుంది. అధికారులు కూడా దీనిని బట్టే ముందస్తు ప్రకటనలు వెలువరుస్తుంటారు.
ఇదిలావుంటే ప్రస్తుతం ఇరిగేషన్ నివేదిక ప్రకారం గంటసేపటి నుంచి భద్రాచలం వద్ద నీటి మట్టం నిలకడగా ఉండగా, సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య గంటకి కేవలం ఒక అంగుళం మాత్రమే పెరిగింది. ప్రస్తుత పరిస్తితి, అంచనాల ప్రకారం పెద్దగా వరద ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే ఒకపక్క ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ, సముద్రాల్లో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో ఆకస్మికంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో నదుల్లో ఆకస్మికంగా వరదలు సంభవించే ప్రమాదం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

