కలం, నల్లగొండ: శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి, రజక వృత్తిదారులను ఆదుకోవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య (Failla Ashaiah) డిమాండ్ చేశారు. నల్గొండలోని వీఎన్ విజ్ఞాన కేంద్రంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకు పెద్దులు అధ్యక్షతన ఆదివారం ‘రౌండ్ టేబుల్ సమావేశం’ నిర్వహించారు. ఈ సమావేశానికి ఫైళ్ళ ఆశయ్య హాజరై మాట్లాడుతూ… ప్రతి రజక వృత్తిదారుడికి ల్యాండ్రీ యూనిట్స్ ఏర్పాటు కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రం, అన్ని మున్సిపాలిటీల్లో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన మోడ్రన్ దోబీ ఘాట్లను నిర్మించాలన్నారు.
ప్రత్యేక చట్టం తీసుకురావాలి..
ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన పాత బకాయిలను వెంటనే చెల్లించి వృత్తిదారులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ఫైళ్ల ఆశయ్య పేర్కొన్నారు. ల్యాండ్రీ షాపుల నిర్వహణకు అవసరమైన స్థలాలను ప్రభుత్వమే కేటాయించాలన్నారు. రజక వృత్తిదారులపై జరుగుతున్న సామాజిక దాడులు, దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ చేగోని సీతారాములు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతారాజు యాదయ్య, రుద్రారపు పెద్దులు, భిక్షం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అవనగంటి నరేష్, పాలమాకుల అర్జున్, అక్కెనపల్లి నాగయ్య, నలపరాల సైదులు, చిక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

