ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు బెల్ట్ షాపులను అడ్డుకోవాలి: రాజగోపాల్ రెడ్డి

కలం, చౌటుప్పల్: బడుగు బలహీన వర్గాల్లో జన్మించి, నాటి దొరల అన్యాయాలను ధిక్కరించి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట పటిమ నేటి మహిళా లోకానికి గొప్ప స్ఫూర్తిగా నిలవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Raj Gopal Reddy) పిలుపునిచ్చారు.

యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు.

ఐలమ్మ స్ఫూర్తితో బెల్టు షాపు నిర్మూలనకు ముందుకు రావాలి..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఐలమ్మ చూపిన తెగువ, స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులను నిర్మూలించడానికి మహిళలందరూ ఐక్యంగా ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. మునుగోడు ప్రాంతం సాగునీరు లేక ఏళ్ల తరబడి ఎడారిలా మారిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులను మధ్యలోనే వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి డిండి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. నకిరేకల్ సభలో సీఎంతో మాట్లాడి, ప్రాజెక్టు పూర్తికి ఆయన అంగీకారం తెలిపిన తర్వాతే సత్కరించానని స్పష్టం చేశారు.

మంత్రి పదవి అధిష్టానం చేతిలోనే ఉంది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. మంత్రి పదవి కోసం తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశాననడం సరికాదని, మంత్రి పదవుల కేటాయింపు అనేది కాంగ్రెస్ అధిష్టానం చేతిలోనే ఉంటుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నుండి పోటీ చేస్తే గెలిపించి మంత్రి పదవి ఇస్తామని అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ, కష్టాల్లో ఉన్న మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే తాను ఇక్కడి నుండి పోటీ చేశానని చెప్పారు. మిగిలిన రెండేళ్ల కాలంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి, నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించి మునుగోడును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>