కలం, హనుమకొండ: వరంగల్ ఎన్ఐటీ (NIT Warangal)లో ఏళ్ల తరబడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేసిన వారిని అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ మేరకు పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హనుమకొండలో వినయ్‌భాస్కర్‌ను కలిసి సమస్యలను వివరించారు. పదేళ్లుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తమను తొలగించడంతో కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల అనుభవం, వారి కుటుంబాల పరిస్థితిని ఎన్ఐటీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ స్థాయిలోనూ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ లీగల్ సెల్ అడ్వైజర్ నాయిని రవి, బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనాథ్ పాల్గొన్నారు.

