కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణవాది, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) 111వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్‌లో(Nizamabad) ఘనంగా నిర్వహించారు. వినాయకనగర్‌లోని (Vinayak Nagar) కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి, అదనపు కలెక్టర్ భుజంగరావు, బీసీ, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు అంకితభావంతో, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంతో పాటు దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆయన కీలకంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. చట్టసభల్లో ప్రజల తరఫున గళమెత్తడంతో పాటు, తన పదవులను సైతం తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయి కుమార్, పద్మశాలి, బీసీ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

