కలం, సోన్: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం (Kadthal Ayyappa Temple) లో అక్టోబర్ 3వ తేదీన గురుస్వాముల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన లక్ష్మీ గణపతి ఉపవాసకులు సుబ్బారావు శర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కడ్తాల్ అయ్యప్ప ఆలయ గురుస్వామి నర్సారెడ్డి, నిర్మల్ హరిహర క్షేత్ర అయ్యప్ప ఆలయ గురుస్వామి పీఎన్ మూర్తి, సీనియర్ గురుస్వామి చెనిగారపు చిన్నయ్య పాల్గొంటారని వివరించారు.
రాబోయే అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమనిష్టలు, పడిపూజల నిర్వహణ, దీక్షలో గురుస్వాముల పాత్రతో పాటు పలు ఆధ్యాత్మిక అంశాలపై సమ్మేళనంలో చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయ్యప్ప దీక్ష చేపట్టే స్వాములకు మార్గదర్శకంగా నిలిచే ఈ సమ్మేళనానికి స్వాములు, గురుస్వాములు, మాలధారణ వేయనున్న స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని శ్రీ ధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ సభ్యులు కోరారు.

