కలం, స్పోర్ట్స్ : టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి త్వరలో కొత్త వ్యక్తి రానున్నారు. అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. మరోసారి కొనసాగేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదని బీసీసీఐకి ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి చీఫ్ సెలెక్టర్‌కు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) కీలక సూచన చేశారు. చీఫ్ సెలెక్టర్ పదవి గౌరవంతో పాటు తీవ్ర ఒత్తిడిని కూడా తీసుకొస్తుందని గవాస్కర్ తెలిపారు. ఎంపిక కమిటీ కలిసి తీసుకున్న నిర్ణయాలకు కూడా చాలా సందర్భాల్లో చైర్మన్‌నే బాధ్యుడిగా చూపిస్తారని పేర్కొన్నారు. ఇతర సెలెక్టర్ల అభిప్రాయాలు లేదా ఒత్తిడి కారణంగా నిర్ణయం మారినా.. మీడియా ముందుకు వెళ్లేది చైర్మనే అని వివరించారు.
మంచి నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా పెద్దగా గుర్తుండవని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఒక్క తప్పిదంగా భావించిన నిర్ణయమే పదేపదే చర్చకు వస్తుందని తెలిపారు. పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త చైర్మన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అగార్కర్ హయాంలో భారత్ 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. 2024, 2026 టీ20 వరల్డ్‌కప్‌లు గెలిచింది. 2026 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సాధించింది. ఇక అక్టోబర్ 4 తర్వాత ఖాళీ అయ్యే చీఫ్ సెలెక్టర్ పదవిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.

