భద్రాద్రిలో గంజాయిపై ఉక్కుపాదం.. ‘మిషన్ పరివర్తన’తో స్మగ్లర్లకు చెక్!

కలం, ఖమ్మం బ్యూరో: ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశ, లగ్జరీ బైకులు, ఖరీదైన ఫోన్ల మోజుతో వేసే తప్పటడుగు.. నిండు జీవితాలను జైలు పాలు చేస్తున్నాయి. ఒడిశా ఏజెన్సీ సరిహద్దులకు ఆనుకుని ఉన్న భద్రాద్రి జిల్లాను స్మగ్లర్లు గంజాయి రవాణా (Ganja Smuggling)కు ప్రధాన మార్గంగా వాడుకుంటూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ దందా ఆటకట్టించేందుకు భద్రాద్రి జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతూనే, మరోవైపు ‘మిషన్ పరివర్తన’తో పక్కా ప్రణాళికతో స్మగ్లర్ల నెట్‌వర్క్‌కు చెక్‌ పెడుతోంది.

కాగా, ఒడిశా అడవుల్లో రూ. 1,500లోపే దొరికే కిలో గంజాయి హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీలకు చేరిస్తే ఏకంగా రూ. 50,000పైనే పలుకుతోంది. ఇంత భారీ లాభాల ఆశ చూపిస్తూ అంతర్రాష్ట్ర ముఠాలు యువకులను, విద్యార్థులను పావుగా వాడుకుంటున్నాయి. నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు సంచుల్లో, బస్సులు, రైళ్లలో ప్రయాణికులలా వెళ్తూ, మరికొందరు కార్లు, కంటెయినర్లలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి రవాణా చేస్తూ ఇలా ఒకరి తర్వాత ఒకరుగా పోలీసులకు చిక్కుతూ ఊచలు లెక్కిస్తున్నారు.

వివరాలివే..

ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలని పెద్దపల్లికి చెందిన ఓ యువకుడు గంజాయి స్మగ్లర్‌గా మారాడు. ఒడిశా వెళ్లి 12 కిలోల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తుండగా వైరా వద్ద పోలీసులకు, ఈగిల్ టీమ్ (Eagle Team) కు పట్టుబడ్డాడు. కర్నాటకకు చెందిన ఇద్దరు యువకులు ఒడిశా నుంచి బైక్‌పై 20 కిలోల గంజాయిని తరలిస్తూ వెళ్తుండగా భద్రాచలం వద్ద రిపేర్ అయింది. సారపాక వద్ద బూర్గంపాడు (Burgampadu) పోలీసులు, ఈగిల్ టీమ్ కు అడ్డంగా దొరికిపోయారు.భద్రాద్రి జిల్లా ఏడూళ్లబయ్యారంలో పోలీసుల తనిఖీల్లో రూ. 25 లక్షల విలువైన గంజాయితో పాటు 3 కార్లను పట్టుకున్నారు. అధికారులు కేవలం అక్కడితో ఆగకుండా నిందితులు, బంధువుల ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారు. అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన మరో రూ. 25 లక్షల విలువైన 2 కార్లు, ఒక బైక్‌ను కూడా జప్తు చేశారు.

ప్రభుత్వ శాఖలన్నీ కలిసికట్టుగా చెక్ పెడుతూ..

గంజాయి దందాకు, అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మావతి సారథ్యంలో పోలీస్, ఎక్సైజ్ ఈగిల్ బృందాలు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ.11.20 కోట్ల విలువైన 2,190.63 కేజీల గంజాయిని జప్తు చేశారు. 219 మందిని అరెస్ట్ చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. ఖమ్మం/భద్రాద్రి రీజియన్‌లో 1,365 కిలోల ఎండు గంజాయి, 2 కిలోల గంజాయి చాక్లెట్లు, 108 మొబైళ్లు, 49 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వ్యసనానికి బానిసలైన 65 మందిని రక్షించి డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించారు. ఇలా శాఖలన్నీ కలిసికట్టుగా సాగిస్తున్న ఈ పోరులో ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మిషన్ పరివర్తన’ (Mission Parivarthana) పథకం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు విద్యార్థుల ప్రవర్తనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read : గులాబీ మయమైన నెక్లెస్ రోడ్: క్యాన్సర్‌పై పోరులో ‘ పింక్ పవర్’ రన్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>