కలం, నల్లగొండ బ్యూరో: “అయ్యా.. రోగమొస్తే రూపాయి ఖర్చు లేకుండా నయమైతదని సర్కార్ దవాఖానకు వస్తే.. డాక్టర్ రాసిన చీటీ పట్టుకుని బయట మందుల షాపుకు పోతే రూ.3వేలు బిల్లు అయింది. చేతిలో పైసల్లేక పక్కింటోళ్ల వద్ద వడ్డీకి అప్పు తీసుకుని వచ్చిన.’’ ఇది నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఇన్ పేషెంట్ బంధువు కన్నీటి గాథ.
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి (Nalgonda Govt Hospital) మందుల కొరత, సర్జికల్ సామగ్రి అభద్రతను ఎదుర్కొంటోంది. ఉచిత వైద్యం మాట దేవుడెరుగు.. కాగితం మీద రాసిచ్చే చీటీలు పట్టుకుని ప్రైవేట్ మెడికల్ షాపుల చుట్టూ తిరగలేక పేద రోగులకు తీవ్ర కష్టాలు తప్పడం లేదు. రోజూ జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రోగులు దవాఖానకు వస్తుంటారు. అయితే, ఓపీ లో డాక్టర్లు రాసే సాధారణ మందులు కూడా ఆస్పత్రి ఫార్మసీలో లభించడం లేదు. ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్ వార్డుల్లో చేరిన రోడుల పరిస్థితి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
సర్జికల్స్ కొరత.. ప్రైవేట్లో కొంటే వాత
ఆపరేషన్లకు అవసరమైన సర్జికల్ గ్లౌజులు, సీరం బాటిళ్లు, డిస్పోజబుల్ మెటీరియల్స్, అత్యవసర ప్రాణరక్షక మందులు, బ్యాండేజీ క్లాత్‌లను కూడా ఆసుపత్రి నుంచి సరఫరా చేయడం లేదు. డాక్టర్లు రాసిచ్చిన పత్రాలతో రోగుల బంధువులు బయటి మెడికల్ షాపుల్లో తెస్తున్నారు. వేలకు వేలు వెచ్చించి సామగ్రి కొంటేనే తప్ప ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చవుతాయని సర్కారు దవాఖానకు వస్తే, ఇక్కడ కూడా రోజుకు వేల రూపాయల భారం పడుతోంది.
దీంతో పేదలు అప్పుల పాలవుతుండగా, మరికొందరు సరిపడా డబ్బులు లేక చికిత్సను మధ్యలోనే ఇళ్లకు పోతున్నారు. ఆసుపత్రి ఫార్మసీలో ఏ మందుల స్టాక్ ఉందో, ఏవి ఖాళీ అవుతున్నాయో ముందస్తుగా అంచనా వేసి హెడ్ ఆఫీస్‌కు నివేదికలు పంపడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత మందులు అందించాల్సిన చోట సగటు రోగికి ప్రైవేట్ మెడికల్ షాపుల చీటీలు రాయడం సర్వసాధారణంగా మారింది. పంపిణీ వ్యవస్థలో సకాలంలో ఇండెంట్లు పెట్టకపోవడంతో ప్రాణరక్షక ఔషధాల కొరత కూడా తీవ్రంగా ఉంది.
జిల్లా అధికారులకు భారీగా విజ్ఞప్తులు
నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మందుల నిల్వలు, సర్జికల్ సామగ్రి లభ్యతపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని రోగులు బంధువులు కోరుతున్నారు. కొరతగా ఉన్న అన్నిరకాల ప్రాణరక్షక మందులు, ఆపరేషన్ థియేటర్ సామగ్రిని అత్యవసర ప్రాతిపదికన ప్రభుత్వం ద్వారా సరఫరా చేయాలనే విజ్ఞప్తులు చేస్తున్నారు.
రోగులకు బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాలని రాసే విధానానికి స్వస్తి పలికి, ఫార్మసీ నుంచే ఉచితంగా అందేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటున్నారు. మందుల కొరతకు కారణమైన వారిపై, రోగులపై ఆర్థిక భారం వేస్తున్న నిర్లక్ష్యపు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ స్వయంగా దవాఖానను సందర్శించి, ఫార్మసీ స్టాక్ రిజిస్టర్లు, ఆపరేషన్ థియేటర్ల పరిస్థితి, రోగుల కష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని కోరుతున్నారు.
పర్యవేక్షణా లోపం.. రోగులకు శాపం
పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. కానీ కిందిస్థాయి పర్యవేక్షణా లోపం వల్ల పేదలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి, మందుల కొరతను తీర్చి సర్కారు దవాఖానపై ప్రజలకున్న నమ్మకాన్ని కాపాడాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

