కలం, నేషనల్ డెస్క్ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC)పై వచ్చిన ఆరోపణల అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే చర్చ జాతీయ స్థాయిలో మొదలైంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆయన రాజీనామా (CEC Resignation)కు డిమాండ్ చేయడం.. దేశవ్యాప్తంగా నిరసనలకు ప్లాన్ చేస్తుండడం.. 48 గంటల్లోగా సీఈసీ రాజీనామా చేయాలని, లేదంటే జంతర్ మంతర్‌లో ఆందోళన చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించడం.. ఆ డెడ్‌లైన్ కూడా ముగియడంతో వివాదం మరింత ముదిరింది. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా, సీజేపీ అల్టిమేటం జారీ చేసినా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయలేదు.
రిజిగ్నేషన్ చేసే ఉద్దేశమూ ఆయనకు లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో అక్టోబర్ 2 నుంచి జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆందోళన ప్రారంభించనున్నది. అదే సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల నిరసనలు మొదలుకానున్నాయి. ఈ ఒత్తిడితో సీఈసీ రిజైన్ చేస్తారా? ఒకవేళ చేస్తే ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నట్లవుతుందా? ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడానికి అవకాశం ఇచ్చినట్లవుతుందా?.. ఇలాంటి చర్చల నేపథ్యంలో ఆయన రిజైన్ చేసే అవకాశాలు లేవన్నదే ఢిల్లీలోని బ్యూరోక్రాట్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రాజ్యాంగబద్ధమైన సంస్థ కావడంతో స్వచ్ఛందంగా తప్పుకోవడం మినహా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదు.
తలొగ్గేది లేదంటున్న బీజేపీ
ప్రతిపక్షాలు, సీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ప్రధాని మోదీ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్లు కేంద్ర బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో తలొగ్గి ఉండాల్సింది కాదని, అప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు అదే తరహాలో సీఈసీ, అమిత్ షా రాజీనామాకు ఒత్తిళ్లు పెరిగాయన్న అభిప్రాయం బీజేపీ పెద్దల్లో నెలకొన్నట్లు కాషాయ శ్రేణులు తెలిపాయి.
ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, ఒత్తిడితో చేయించినా జాతీయ మీడియాలో వచ్చిన కథనం వాస్తవమేనంటూ ఒప్పుకున్నట్లవుతుందని, ఇంతకాలం తీసుకున్న నిర్ణయాలను రివ్యూ చేయడానికి ఆస్కారం ఇచ్చినట్లవుతుందన్నది బీజేపీ భావన.
మరోవైపు ప్రతిపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గినట్లవుతుందన్న రాజకీయ అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. ఒకసారి లొంగితే ఇకపై చాలా అంశాల్లో ఇలాంటి డిమాండ్లు, ఒత్తిళ్లు పెరుగుతాయని, దానికి ఆస్కారం ఇవ్వొద్దన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ సీఈసీపై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం పెట్టినా, అది ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని, పార్లమెంట్ ఉభయ సభల్లో సంఖ్యాబలం రీత్యా చూస్తే ప్రతిపక్షాలకు అంత సీన్ లేదన్న అభిప్రాయాన్ని బీజేపీ వర్గాలు వ్యక్తం చేశాయి.
ఒక కమిషనర్ ఔట్!
సీఈసీకి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్‌లోని అంతర్గత వివరాలను మీడియాకు ఎవరో లీక్ చేశారన్న అనుమానం బలపడుతున్నది. సీఈసీ రిజిగ్నేషన్కు రాజకీయ ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితుల్లో ఒక కమిషనర్ తప్పుకునే అవకాశాలపై గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఆయనే రిజైన్ చేస్తారా? లేక ప్రభుత్వ పెద్దలు తెరవెనక వ్యవహారం నడిపి రిజైన్ చేయిస్తారా?.. వీటిలో ఏదైనా జరగవచ్చన్నది ఢిల్లీ వర్గాల సమాచారం.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, మరో ఎలక్షన్ కమిషనర్ ఎస్ఎస్ సంధు 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లు. కాగా మూడో కమిషనర్ వివేక్ జోషి వీళ్ల కంటే ఒక సంవత్సరం జూనియర్ (1989 బ్యాచ్). సీఈసీపై ఆగ్రహంగా ఉన్న కమిషనర్ ఎవరన్న ఆసక్తికరమైన చర్చ కమిషన్‌లోనే కాక ఢిల్లీలోని బ్యూరోక్రాట్ వర్గాల్లోనూ మొదలైంది. ఇప్పటికే నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ఆధారంగా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ను లీక్ చేసిన కమిషనర్‌ను సాగనంపేలా కసరత్తు మొదలైందని, అది ‘స్వచ్ఛంద రాజీనామా’ అనే తీరులో ప్రతిబింబిస్తుందన్నదని బ్యూరోక్రాట్ వర్గాల సమాచారం.
మోదీ సర్కార్‌కు తలనొప్పి
ఎలక్షన్ కమిషన్‌ను జేబు సంస్థగా మార్చుకున్నదంటూ బీజేపీపై చాలా కాలంగా విపక్షాల నుంచి విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యంగబద్ధ సంస్థను చెప్పుచేతల్లో పెట్టుకున్నదంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. ఇంతకాలం ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పిన బీజేపీ.. ఇప్పుడు ఈసీని లోబర్చుకుని దాని ప్రతిష్టను మసకబార్చిందంటూ పలు పార్టీలు దుమ్మెత్తిపోశాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.
ఇలాంటి సమయంలో చీఫ్ కమిషనర్‌కు వ్యతిరేకంగా జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు, దాన్ని విపక్షాలు అందుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండడంతో ప్రధాని మోదీ, అమిత్ షా టార్గెట్ అయ్యారు. సీఈసీతో పాటు హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇప్పటికే కాక్రోచ్ ఒత్తిడికి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించి అప్రతిష్టను మూటగట్టుకున్నామని అనుకుంటున్న ప్రధానికి ఇప్పుడు సీఈసీ రిజిగ్నేషన్ ఒత్తిడి పెరగడం తలనొప్పిగా మారింది.
కమిషన్ అధికారుల కదలికపై నిఘా
కేవలం ఇద్దరు కమిషనర్లపై అనుమానాలే కాకుండా పలువురు అధికారుల నుంచి కూడా సమాచారం లీక్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానం. అందుకే అలాంటి అనుమానం ఉన్న అధికారుల కదలికపై నిఘా మొదలైంది. వివిధ స్థాయిల్లో ఉన్న ఈ అధికారుల గత చరిత్ర, ఏవైనా శాఖాపరమైన చర్యలకు గురయ్యారా? కేసులు నమోదై విచారణ ఎదుర్కొంటున్నారా? ఆదాయానికి మించిన ఆస్తులున్నాయా? సర్వీసు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారా? లాంటి అంశాలను సేకరించే పని మొదలైంది.
అవసరమైతే ఒకరిద్దరు అధికారులపై దర్యాప్తు సంస్థల సోదాలు, విచారణలు జరిగే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారి డిజిటల్ ఫుట్ప్రింట్స్పై ఇప్పటికే విశ్లేషణ మొదలైనట్లు తెలిసింది. సీఈసీ వ్యవహారంలో రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరగనుంది. ప్రతిపక్షాలు, సీజేపీ ఆందోళనలు, నిరసనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నది.

