పామాయిల్ మాయం.. అక్రమ రవాణా గుట్టు రట్టు!

కలం, ఖమ్మం బ్యూరో: తూకం యంత్రం వద్ద తేడా ఉండదు.. పామాయిల్ ట్యాంకర్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీకి ఎలాంటి అనుమానం రాదు. తీరా గమ్యస్థానానికి చేరేసరికి లీటర్ల కొద్దీ పామాయిల్ మాయమవుతోంది. భద్రతా లొసుగులను ఆసరాగా చేసుకుని రెండేళ్లుగా సాగుతున్న అక్రమ రవాణా ముఠా గుట్టును ఖమ్మం పోలీసులు (Khammam Police) చాకచక్యంగా ఛేదించారు. వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ​నిందితులు వేసిన ప్లాన్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.

వాటర్ క్యాన్లు, రాళ్లు పెట్టి..

ఖమ్మం సమీపంలోని సీతానగరం వద్ద ఉన్న గోద్రేజ్ అగ్రొవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు పామాయిల్ ట్యాంకర్లు వెళ్లే క్రమంలో ఈ మోసం జరుగుతోంది. ట్యాంకర్ డ్రైవర్లు ఫ్యాక్టరీ గేటు వద్ద ఉన్న వేయింగ్ మిషన్ పైకి వెళ్లేటప్పుడు దాదాపు 20 లీటర్ల సామర్థ్యం ఉన్న ఐదు వాటర్ క్యాన్లను లేదా అంతకు సమానమైన బరువైన రాళ్లను ట్యాంకర్‌లో ఉంచి లోడింగ్‌కు ముందు తూకం వేయించుకుంటున్నారు.

లోపలికి వెళ్లిన వెంటనే ఆ నీటిని లేదా రాళ్లను పక్కన పెట్టేసి.. ట్యాంకర్‌లో పామాయిల్ నింపుకుని తిరుగు ప్రయాణంలో తూకం వేయించుకుంటున్నారు. దీనివల్ల కంపెనీ రికార్డుల్లో తూకం సరిగ్గా ఉన్నట్లు చూపిస్తుంటుంది. కానీ, నిందితులు ప్రతి ట్రిప్‌కు 100 నుంచి 200 లీటర్ల అదనపు పామాయిల్ చాకచక్యంగా పక్కదారి పట్టిస్తున్నారు.

కోదాడ వ్యాపారితో దందా..

​ఇలా దొంగలించిన ఆయిల్‌ను మార్గమధ్యలో కోదాడకు చెందిన ఒక వ్యాపారికి లీటరుకి రూ.100 నుంచి రూ.105 చొప్పున విక్రయిస్తుంటే.. సదరు వ్యాపారి దాన్ని బహిరంగ మార్కెట్‌లో రూ.160కి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. పోలీసుల విచారణలో ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఉన్న డిజిటల్ సాక్ష్యాలను గుర్తించారు. కోదాడ వ్యాపారి ఖాతా నుంచి వివిధ ట్యాంకర్ డ్రైవర్లకు యూపీఐ ద్వారా దాదాపు రూ.9,30,000 వరకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఖమ్మం పోలీసులు ప్రధాన డ్రైవర్, కోదాడ వ్యాపారితో సహా నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. కంపెనీ పరిసరాల్లో సరైన సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థ లేకపోవడమే ఈ మోసానికి ప్రధాన కారణమని తేలింది. ఈ కుట్రలో ఫ్యాక్టరీ సిబ్బంది ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>