ఆయిల్ పామ్ రైతులకు అధిక ఆదాయం: మంత్రి తుమ్మల

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును రాబోయే 3–4 ఏళ్లలో 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) తెలిపారు. రైతులకు స్థిరమైన, అధిక ఆదాయం అందించే పంటగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలోని ఆయిల్‌ఫెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి మంత్రి సందర్శించారు. ఫ్యాక్టరీ పనితీరు, నీటి లభ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో సాగవుతున్న ఆయిల్ పామ్ తోటల్లో సగానికి పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6 లక్షల ఎకరాల్లో, తెలంగాణలో ఇప్పటికే 4 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందన్నారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాను తొలి సంతకం నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికే చేశానని తెలిపారు. అధికారుల కృషితో ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా పూర్తయిందన్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీలో 70 వేల మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసినట్లు వెల్లడించారు. ఫ్యాక్టరీలో ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్) అధికంగా ఉండటంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తోందన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించిన సమయంలో టన్ను గెలల ధర రూ.12 వేలుగా ఉండగా, ప్రస్తుతం రూ.24 వేలకు పెరిగిందని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యాధునిక యంత్రాలతో నిర్మించిన నర్మెట్ట ఫ్యాక్టరీ రాష్ట్రానికి మణిహారంగా నిలిచిందన్నారు. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న ఈ ఫ్యాక్టరీ అన్ని జిల్లాల ఆయిల్ పామ్ రైతులకు సేవలందిస్తోందని పేర్కొన్నారు.

10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ఉన్న ప్రతి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మరో 11 ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతోందన్నారు. రిలయన్స్ సంస్థ కూడా తెలంగాణలో రిఫైనరీతో కూడిన ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. నర్మెట్ట ఫ్యాక్టరీలో రిఫైనరీ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదికి రిఫైనరీ పూర్తయి అక్కడే నేరుగా ఆయిల్ ఉత్పత్తి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. దేశంలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. పామాయిల్ రైతుల ప్రయోజనాల కోసం 44 శాతం దిగుమతి సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఈ విషయాన్ని రాష్ట్ర ఎంపీల ద్వారా ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>