కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జడ్చర్ల (Jadcherla) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను అక్రమంగా తొలగించడం అన్యాయమని AITUC రాష్ట్ర కార్యదర్శి ఆరోపించారు. శనివారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) నేతృత్వంలో అకారణంగా అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెండు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, కార్మికులపై వేధింపులు ఆపాలని కోరారు. అర్హులైన సీనియర్ పారిశుద్ధ్య కార్మికులకు పేషంట్ కేర్ సెక్యూరిటీ పోస్టులకు ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షదుల్లికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఎలాంటి కారణం లేకుండా శ్రీ శాంతి ఏజెన్సీ కాంట్రాక్టర్ నలుగురు కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగింపుకు గురైన కార్మికులు కాంట్రాక్టర్ అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారని అన్నారు. ఇలా వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
దాదాపు మూడు నెలలుగా వేతనాలు అందక జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే నెల మొదటి రోజే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా సకాలంలోనే విడుదల చేసినప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా కార్మికులకు ఇంకా వేతనాలు అందలేదు. జీతాలు లేక కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న శ్రీ శాంతి ఏజేన్సీపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఆసుపత్రి నుంచి అక్రమంగా తొలగించిన కార్మికులను ఎలాంటి నిబంధనలు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని కార్మికులు, వారి మద్ధతుదారులు హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కార్మికులు నరసింహ, నాగరాజ్, శేఖర్, రవీందర్ రామకృష్ణ, నాగరాజు, విజయలక్ష్మి, సుక్కమ్మ, లక్ష్మీ నరసమ్మ, పద్మ, జయమ్మ, నీలమ్మ, భార్గవి, నీరజ, రాధిక, నాగమ్మ, సుమతమ్మ తదితరులు పాల్గొన్నారు.

