2027 వరల్డ్ కప్‌తో వీడ్కోలు : కోహ్లీ

కలం, స్పోర్ట్స్: భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులకు కీలక విషయం వెల్లడించారు. 2027 వన్డే ప్రపంచకప్‌ (2027 ODI World Cup) తనకు చివరిదని స్పష్టం చేశారు. ప్రపంచకప్‌ సాధించాలనే బలమైన కోరికే తనకు ప్రధాన ప్రేరణ అని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో వన్డేల్లో మాత్రమే ఆడుతున్న కోహ్లీ, కప్పు గెలవడం కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమని వెల్లడించారు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఆయన ‘జియోస్టార్’తో మాట్లాడారు. వన్డే ప్రపంచకప్‌లో ఆడేటప్పుడు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు. టీ20ల కంటే ఎక్కువ తీవ్రతతో 10 మ్యాచ్‌లు ఆడటం ఎంతో సవాలుతో కూడుకున్నదని అన్నారు. దానికితోడు విదేశీ పిచ్‌లపై ఆడటం వల్ల ఆటగాళ్లపై ఎక్కువ ప్రభావం పడుతుందని చెప్పారు.

భారత్‌కు ఇది తనకు చివరి ప్రపంచకప్ అని, అందుకే మైదానంలో తన శక్తినంతా ధారపోస్తానని కోహ్లీ స్పష్టం చేశారు. ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన ధ్యేయమని, దానికోసం ఏమి చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన కోహ్లీ, 2023 ఫైనల్లోనూ ఆడారు. ఆయన తన ప్రపంచకప్ కెరీర్‌లో 37 మ్యాచ్‌ల్లో 1,795 పరుగులు సాధించారు.

వన్డే కెరీర్‌లో మొత్తం 302 ఇన్నింగ్స్‌లలో 54 సెంచరీలు, 79 అర్ధసెంచరీలతో 14,941 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా 2027 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌తో భారత్ తమ ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>