కలం, వెబ్ డెస్క్ : ఇరాన్‌తో సైనిక, రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ప్రపంచంలోనే కీలక చమురు రవాణా మార్గమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) పేరును మార్చి, తన పేరిట ‘ట్రంప్ స్ట్రెయిట్’ (Trump Strait)గా చూపిస్తున్న ఒక మ్యాప్‌ను ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫారమ్‌లో పంచుకున్నారు.
అయితే ఇది కేవలం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన మాత్రమేనని, అంతర్జాతీయంగా ఈ పేరు మార్పునకు ఎలాంటి అధికారిక ప్రాధాన్యత లేదా గుర్తింపు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంపై అమెరికాకు పూర్తి సైనిక నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు నౌకల ప్రయాణాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఖతార్ ద్వారా ఇరాన్ సమర్పించిన ఈ ఏడు రోజుల ప్రణాళికలో.. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షలను సడలించాలని, రవాణాను సురక్షితం చేయాలని షరతులు విధించింది. అయితే ఈ ప్రతిపాదనలను నిరాకరిస్తూ, ట్రంప్ ఈ కొత్త మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు వార్తాకథనాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో వినియోగించే ఐదవ వంతు చమురు రవాణా ఈ మార్గం గుండానే సాగుతుండటంతో, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ వివాదం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కలవరపెడుతోంది.

