కలం, స్పోర్ట్స్ : ఆసియన్ గేమ్స్(Asian Games)లో భారత స్క్వాష్ స్టార్ అనాహత్ సింగ్ (Anahat Singh) సంచలనం సృష్టించింది. ప్రపంచ నంబర్ 6 సతోమి వతనాబేను ఓడించి మహిళల సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండు గేమ్స్ వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని 3-2తో మ్యాచ్ గెలిచింది. నాగోయా కింజో ఫుటో అరేనాలో జరిగిన సెమీఫైనల్లో వతనాబేకు అనాహత్ ఆరంభంలో తడబడింది. జపాన్ స్టార్ 11-9, 13-11తో వరుసగా రెండు గేమ్స్ గెలిచింది. దీంతో అనాహత్ ఫైనల్ ఆశలు కష్టంగా మారాయి.
మూడో గేమ్‌లో అనాహత్ (Anahat Singh) కు కీలక పరీక్ష ఎదురైంది. 8-10తో వెనుకబడిన సమయంలో వతనాబేకు రెండు మ్యాచ్ పాయింట్లు వచ్చాయి. కానీ అనాహత్ వాటిని కాపాడుకుంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించి 12-10తో గేమ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఇద్దరు ఆటగాళ్లు ఢీకొనడంతో కొద్దిసేపు ఆట ఆగింది. చికిత్స తర్వాత అనాహత్ మళ్లీ కోర్టులోకి వచ్చింది. మూడో గేమ్ విజయంతో అనాహత్‌లో నమ్మకం పెరిగింది. నాలుగో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడింది. 11-6తో గెలిచి మ్యాచ్‌ను 2-2తో సమం చేసింది.
నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో మాత్రం అనాహత్ పూర్తి ఆధిపత్యం చూపించింది. వతనాబేకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా 11-3తో గేమ్‌ను గెలిచింది. దీంతో మ్యాచ్‌ను 9-11, 11-13, 12-10, 11-6, 11-3తో సొంతం చేసుకుంది. ఈ విజయంతో అనాహత్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరింది. దీంతో భారత్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది. ఇప్పుడు స్వర్ణం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

