వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటికీ ఆదర్శం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి, హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ మనందరికీ స్ఫూర్తి అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) కొనియాడారు. శనివారం మహబూబ్ నగర్ పురపాలిక పరిధిలోని పాలకొండలో ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. దొరలకు,భూస్వాములకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం చేసారని, పేదలకు భూములు ఇవ్వాలని..వాళ్ళు వ్యవసాయం చేయాలని రోకలి బండతో ఐలమ్మ పోరాటం సాగించిన ధీరవనితగా ఆయన కీర్తించారు.

ఐలమ్మ అన్ని వర్గాల గురించి పోరాటం చేసిందని,ఒక వర్గానికి..కులానికి ఆమెను పరిమితం చేయవద్దన్నారు.ఐలమ్మ స్పూర్తితో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.సామాన్య పేద రజక కుటుంబంలో పుట్టిన ఐలమ్మ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని అన్యాయానికి తలవంచకుండా హక్కుల కోసం పోరాడారన్నారు. తెలంగాణ ప్రజలకు నూతన స్ఫూర్తిని, తెగువను అందించిందన్నారు. నాటి భూస్వాములను ఎదురించి ధిక్కార స్పూర్తిని, నాటి చట్టాల పరిధిలో న్యాయస్థానంలోనూ పోరాడి గెలిచి ప్రజాస్వామిక స్పూర్తిని ప్రదర్శించిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమన్నారు.

చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పిందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రములో ఆమె విగ్రహంతో పాటు పలువురు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాలకొండ ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసామని,మళ్లీ అధికారంలోకి వస్తే స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కంపెనీలు తీసుకువస్తామన్నారు.

అనంతరం పద్మావతి కాలనీలోని గ్రీన్ బెల్ట్ వద్ద ఐలమ్మ విగ్రహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ,పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు సరస్వతి, సీనియర్ నాయకులు కుర్వ శ్రీశైలం, నరేందర్ , క్రాంతి, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, ఆంజనేయులు, రవికిషన్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, కోట్ల నర్సింహా , అహ్మదుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>