కలం, నల్లగొండ బ్యూరో: ఆకర్శించే ప్రకటనలు, కలర్‌ఫుల్ బ్రోచర్లు, ఏజెంట్ల మాయమాటలు.. ఇవన్నీ నమ్మి కొనుగోలు చేసిన వినియోగదారులు నిండామునిగారు. రియల్ ఎస్టేట్ సంస్థ ఇన్‌క్రెడిబుల్ ఇండియా (Incredible India Scam) కస్టమర్లకు తీవ్ర శోకం మిగిల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా సాగిన భారీ రియల్ ఎస్టేట్ మాఫియా అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్లాట్లు ఇస్తామని చెప్పి కొనుగోలుదారుల నుంచి వందల కోట్లు వసూలు చేసిన నిర్వాహకులు, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేయకుండా ముఖం చాటేసి బాధితులను రోడ్డున పడేశారు.
పదేళ్ల కింద వల..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటనల నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా విస్తరించింది. ఇదే క్రమంలో పదేళ్ల కింద భువనగిరి మండలం రుస్తాపూర్ తండా సమీపంలో ‘ ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ భారీ వెంచర్‌ను చేపట్టింది. సుమారు 15 వేల ప్లాట్లను విక్రయించడమే లక్ష్యంగా తమ ఏజెంట్లను రంగంలోకి దించింది. రోజువారీ కూలీలు, మధ్యతరగతి ప్రజలతో పాటు సైనికులు, మాజీ సైనికులను టార్గెట్ చేసి, నెలవారీ వాయిదాల పద్ధతిలో ఒప్పందాలు కుదుర్చుకుంది.
వాయిదాలు తీరినా తిప్పలు తప్పట్లే..
సంస్థ మాటలు నమ్మిన కొనుగోలుదారులు 30 – 42 నెలల పాటు వాయిదాలు చెల్లించారు. ఒప్పందం మేరకు మొత్తం సొమ్ము చెల్లించినప్పటికీ ఏడాది, రెండేళ్లు గడుస్తున్నా నిర్వాహకులు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. బాధితులు సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి నిలదీస్తే దాటవేత సమాధానాలు చెబుతూ, ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా.. ఇప్పుడు భూముల రేట్లు పెరిగాయి.. అదనంగా రూ.4 లక్షల వరకు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాం” అంటూ కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చి బాధితులను తీవ్ర వేధింపులకు సంస్థ నిర్వాహకులు గురిచేస్తున్నారు.
ఒకే ప్లాట్ నలుగురికి సేల్
సంస్థ చేసిన మోసంలో అత్యంత తీవ్రమైనదేంటంటే.. అసలు వెంచర్‌లో లే అవుట్లకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. ఒకే సర్వే నంబర్ పేరుతో మూడు రకాల లేఅవుట్లు వేసింది. ఒకే ప్లాట్‌ను ముగ్గురు, నలుగురికి చూపిస్తూ అడ్వాన్సులు, వాయిదాలు వసూలు చేసింది. కొందరికి గతంలో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ, భూమిపై ఆ ప్లాట్ ఎక్కడుందో చూపించలేని దుస్థితి నెలకొంది. బ్రోచర్లలో చూపించిన వెంకటేశ్వరస్వామి ఆలయం, రోడ్లు, డ్రైనేజీలు కాకుండా ప్రస్తుతం ఆ వెంచర్ నిండా పెద్ద పెద్ద బండరాళ్లు, గుంతలు తప్ప మరేమీ లేవు.
కష్టపడి సంపాదించిన సొమ్మును రియల్ మాఫియా చేతిలో పెట్టి రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.
పోలీస్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి సంస్థ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు ప్లాట్లు లేదా డబ్బులు తిరిగి దక్కేలా న్యాయం చేయాలని కోరుతున్నారు.
అదనంగా రూ.4 లక్షలు కట్టమంటున్నారు : నరహరి, బాధితుడు, రాజాపేట
2018లో రూ.3.75 లక్షలకు 150 గజాల ప్లాట్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాను. నెలకు రూ.8,000 చొప్పున 39 నెలలు కట్టడమే కాకుండా, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.32,500 కూడా కట్టించుకున్నారు. కానీ, రెండేళ్లుగా తిప్పుకుంటూ ఇప్పుడు అదనంగా రూ.4 లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని బుకాయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.

