కలం, జగిత్యాల: ధర్మపురి నియోజకవర్గంలోని (Dharmapuri Constituency) అన్ని గ్రామాలకు సాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) తెలిపారు. శుక్రవారం పెగడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం సహాయ నిధి, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందన్నారు. వ్యవసాయాధారిత ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించి, అవసరమైన నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
గొల్లపల్లి మండలంలోని రంగధామునిపల్లి, దీకొండ చెరువులను అభివృద్ధి చేసి పెగడపల్లి మండలానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెగడపల్లి మండలంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
154 మంది లబ్ధిదారులకు చెక్కులు
పెగడపల్లి (Pegadapalli) మండలంలోని 39 మంది లబ్ధిదారులకు రూ.39,04,524 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా 115 మంది లబ్ధిదారులకు రూ.35,39,500 విలువైన చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న ప్రజా పాలనలో భాగంగా వచ్చే దసరాకు మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేస్తామని మంత్రి తెలిపారు.
గోదావరి పుష్కరాలకు రూ.80 కోట్ల అదనపు నిధులు
2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో పుష్కరాల పనులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.117 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా మరో రూ.80 కోట్ల నిధులు కావాలని కోరగా, ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి, ఒరుగాలి శ్రీనివాస్, సంది మల్లారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

