కలం, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వడ్డేపల్లి (Waddepally) జవహర్ నగర్ క్రాస్ వద్ద ఉన్న సరస్వతి ఎంటర్ప్రైజెస్ లో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది అధికారి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నుంచి ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సుబేదారి సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు.
అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి అగ్ని పొరలు బయటికి వచ్చి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దాదాపు నాలుగు కోట్ల ఆస్తినట్టం జరిగినట్టు తెలుస్తోంది. సామాన్య గిరిజన కుటుంబం నుంచి మారుమూల తండా నుంచి వచ్చిన భూక్య బద్రు నాయక్ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రమాద విషయం తెలుసుకున్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ నేత ఆంగోత్ వినోద్ లోక్ నాయక్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నేత రాజు నాయక్ ఘటనపై స్పందిస్తూ బాధితులను ఆదుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. బద్రునాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

