కలం, నిజామాబాద్ బ్యూరో : దీన్ దయాళ్ ఉపాధ్యాయ అందించిన అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) తెలిపారు. శుక్రవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి పురస్కరించుకొని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందే వరకు దేశ అభివృద్ధి పూర్తికాదనే ఆలోచన అంత్యోదయ సిద్దాంతంలో ఉందన్నారు.
భారతీయ ఆలోచనా విధానానికి, దేశసేవకు, సామాజిక సమరసతకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అని ఎమ్మెల్యే ధన్ పాల్ కొనియాడారు. రాజకీయాన్ని కేవలం అధికార సాధనంగా కాకుండా సమాజసేవకు ఒక మార్గంగా చూడాలనే భావనతో ఆయన పనిచేశారన్నారు. దీనదయాళ్ ఉపాధ్యాయ దేశానికి అందించిన అత్యంత ముఖ్యమైన ఆలోచనల్లో “ఏకాత్మ మానవవాదం” ఒకటని గుర్తుచేశారు. మనిషి, సమాజం, దేశం, ఇవన్నీ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని వివరించారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ జీవితం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. ఆయన సందేశం ప్రకారం దేశం కోసం ఆలోచించాలి, సమాజం కోసం పనిచేయాలి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, మహిళా మోర్చ అధ్యక్షురాలు వనిత, ఎస్సీ మోర్చ అధ్యక్షులు పురుషోత్తం, కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్, స్రవంతి వినోద్ రెడ్డి, ప్రసూన శ్రీనివాస్, వైష్ణవి సుధా, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, సుమిత్ర కిషోర్, మండల అధ్యక్షులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.

