కలం, తెలంగాణ బ్యూరో: దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు అన్ని పార్టీలకు తలనొప్పి తెచ్చిపెట్టింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. షెడ్యూలు ఫిక్స్ కావడమే తరువాయి. ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక పదవీకాలం 2028 డిసెంబరు వరకే. రెండేళ్ల కాలానికే అయినా గెలిచి తీరాలన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పట్టుదల. ఈ రెండేళ్ల కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయడం అవసరమా? అనే అభిప్రాయం ఆయా పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.
కానీ, ఈ ఉప ఎన్నిక ఫలితం ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు, అటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కీలకంగా మారుతుందనే భావన బలంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తలపించేలా ఖైరతాబాద్ బైఎలక్షన్ కూడా ఖరీదైనదిగా మారనుంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం అభ్యర్థి ఖర్చు లక్షల్లోనే ఉన్నప్పటికీ.. కంటికి కనిపించని రీతిలో ఎన్ని వందల కోట్లు ఖర్చవుతాయోననే చర్చ స్థానికంగా మొదలైంది. ఏం చేసినా, ఎంత ఖర్చు పెట్టినా గెలవాల్సిందేననే స్పష్టమైన నిర్ణయంతో పార్టీలు ఉన్నాయి.
బీఆర్ఎస్ మొదటి నుంచి ధీమా..
పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ పై అనర్హత వేటు తప్పదని మొదటి నుంచీ ధీమాతో ఉన్న బీఆర్ఎస్ కు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ సానుకూల పరిణామమే ఎదురైంది. ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ లీడర్లు, కేడర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ చాలా కాలం ముందే అలర్ట్ మెసేజ్ ఇచ్చారు. గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థేనంటూ లోకల్ లీడర్లలో జోష్ నింపారు. కేటీఆర్ కోరుకున్నట్లుగానే ఇప్పుడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సిట్టింగ్ సీటు కావడంతో దీనిని తిరిగి గెలిపించుకోవడం ఆయనకు తప్పనిసరి అయింది.
గేమ్‌లోకి బీజేపీ..
ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్యే ఉంటుందనే చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ కూడా ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకే ఒక్కసారి గెలిచిన ఈ స్థానాన్ని ఈసారి చేజిక్కించుకోవడం ద్వారా ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, అటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నది. ద్విముఖ పోరు ఇప్పుడు త్రిముఖ పోరుగా మారుతున్న నేపథ్యంలో ఏ పార్టీకి అనుకూలం? ఏ పార్టీకి చేటు? అనే చర్చలు మొదలయ్యాయి.
ఊహకు అందని రీతిలో ఎత్తుగడలు..
అధికారంలో ఉన్నందున ఖైరతాబాద్‌ను గెలవాలన్నది కాంగ్రెస్ పంతం. ప్రజలు కేసీఆర్ ఇమేజ్ చూసి ఓటు వేసి దానం నాగేందర్‌ను గెలిపించుకున్నందున.. ఇప్పుడు ఉప ఎన్నికలోనూ ఆ సీటును నిలబెట్టుకోవాలన్నది బీఆర్ఎస్ తపన. ఇందుకోసం పోలింగ్ బూత్‌లవారీగా కేడర్‌ను మోహరించే వ్యూహాలకు రెండు పార్టీలూ పదునుపెడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇదే ఫార్ములాను ఈ పార్టీలు అమలు చేశాయి. దీంతో ఈసారి ఊహకు అందని రీతిలో ఈ పార్టీలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
రేవంత్ రెడ్డి vs కేసీఆర్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పోలిస్తే ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో కసి మరింత పెరిగింది. ఈ ఎన్నిక రేవంత్‌రెడ్డి వర్సెస్ కేసీఆర్ తరహాలో మారనుంది. కేవలం ఒకే ఉప ఎన్నిక కావడంతో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడానికి పార్టీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర జిల్లాల్లోని నేతలందరినీ ఇక్కడికి రప్పించి.. ప్రతి వార్డుకు, ప్రతి బస్తీకి ఒకరి చొప్పున బాధ్యతలు అప్పగించి, ఓటు బ్యాంకు చేజారకుండా పకడ్బందీగా వ్యవహరించనున్నాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్కు డూ ఆర్ డై తరహాలో మారింది.

