జూరాల నీటికి ‘వారాబందీ’ విధానం: మంత్రి జూపల్లి స్పష్టత

కలం, వనపర్తి: వానాకాలం పంటలను కాపాడేందుకు జూరాలకు (Jurala Water) కృష్ణా జలాలను విడుదల చేయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ సాగు, తాగునీటి అవసరాలు తీర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి కలెక్టరేట్‌లో సాగు, తాగునీటి పరిస్థితిపై మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్‌ సురభి, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం పంటలు, తాగునీటి అవసరాలకు సుమారు 18.19 టీఎంసీల నీరు అవసరమని తెలిపారు. జూరాలలో ప్రస్తుతం ఉన్న నీటితోపాటు కర్ణాటక నుంచి వస్తున్న జలాలను కలిపి జాగ్రత్తగా వినియోగిస్తే పంటలు, తాగునీటి అవసరాలను తీర్చవచ్చన్నారు. డిస్ట్రిబ్యూటరీల వారీగా సమానంగా నీరు అందించేలా వారాబందీ విధానం అమలు చేయాలని ఆదేశించారు. లష్కర్లు, ఇతర సిబ్బందితో ఆన్‌–ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని సూచించారు. వారాబందీపై వ్యవసాయ విస్తరణాధికారులకు అవగాహన కల్పించి రైతులకు వివరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో జమ్మూ, సిల్టింగ్‌ తొలగింపు, ఇతర మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నవంబరు 27 వరకు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేస్తేనే వానాకాలం పంటలను కాపాడుకోవచ్చని, రైతులు సహకరించాలని కోరారు.

సమన్వయంతో పనిచేయాలి

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ .. రైతుల సంక్షేమం, సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. నీటి నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమాచార లోపం లేకుండా చూడాలని సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, విడుదల వివరాలను ప్రతిరోజూ మీడియాకు వెల్లడించాలని ఆదేశించారు. నీటి లభ్యతకు అనుగుణంగా రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి సాగు ప్రణాళిక చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

తుంగభద్ర జలాలపైనా దృష్టి

నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, జూరాలలో నీరు ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడం లేదనే అపోహలు రైతుల్లో ఉన్నాయని, వాస్తవ పరిస్థితులను వారికి వివరించాలని అన్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి కృష్ణా జలాలను విడుదల చేయించామని, త్వరలో తుంగభద్ర జలాలను ఆర్డీఎస్‌కు విడుదల చేసేలా కృషి చేస్తామని తెలిపారు.

‘ఒక్క ఎకరం ఎండకూడదు’

జిల్లాలో రైతులు సాగు చేసిన పంటల్లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదన్న లక్ష్యంతో కర్ణాటక ముఖ్యమంత్రితో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల బృందం చర్చించి జూరాలకు కృష్ణా జలాలు విడుదల చేయించినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని అవసరమైన ప్రాంతాల్లోనే వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. కోయిల్‌సాగర్‌ను సాధ్యమైనంత మేర నింపేందుకు రెండు మోటార్లను వెంటనే నడిపించాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌, ఎస్పీలు సునీతారెడ్డి, శ్రీనివాసరావు, ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ రహీముద్దీన్‌, ఎస్‌ఈ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>