కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ (Aryadan Muhammed) అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ గా (Best Public Servant) ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ ప్రజా సేవకులకు ఏటా ఈ పురస్కారం అందజేస్తారు. కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం జరగనున్న కార్యక్రమంలో రేవంత్ అవార్డు స్వీకరించనున్నారు. కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్యదాన్ మహమ్మద్ స్మారకార్థం ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతకు లక్ష రూపాయల నగదు బహుమతి, ప్రశంస పత్రం, జ్ఞాపికను అందజేయనున్నారు.
రైతులు, వెనుకబడిన వర్గాలు, ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు, ఆయన నాయకత్వ ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగనుంది. ఆర్యదాన్ మహమ్మద్ కేరళలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, నాలుగు ప్రభుత్వాలలో వివిధ శాఖల మంత్రిగా సేవలందించారు.

