కలం, ఖమ్మం బ్యూరో: గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాతో కోట్లు కూడబెట్టుకోచ్చనుకునే నేరస్తులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు (Bhadradri Kothagudem Police) గట్టి షాక్ ఇస్తున్నారు. కేవలం అరెస్టు చేసి జైలుకు పంపడమే కాకుండా, నేరాల ద్వారా ఆర్జించిన ప్రతి రూపాయిని జప్తు చేస్తూ వారి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడికి చెందిన రూ.21,15,907 విలువైన ఆస్తులను పోలీసులు జప్తు చేశారు.
ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మండేపల్లి గ్రామానికి చెందిన పల్లపు రఘు (35) అనే కారు డ్రైవర్ హైదరాబాద్ ఉప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. నిషేధిత గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టు 28న ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో NDPS చట్టం ప్రకారం అతడిని అరెస్ట్ చేశారు.
అరెస్టుతో దర్యాప్తు ఆపకుండా, నిందితుడు గంజాయి వ్యాపారంతో సంపాదించిన సొత్తుపై పోలీసులు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా చెన్నై కాంపిటెంట్ అథారిటీ ద్వారా ఫ్రీజింగ్ ఆర్డర్ పొంది, న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు నిందితుడి పేరుతో ఉన్న రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్‌తో పాటు అతడి భార్య పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాను జప్తు చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు, బ్యాంక్ ఖాతాలోని నిధుల మొత్తం విలువ సుమారు రూ.21,15,907 గా ఉన్నట్లు సీఐ వెల్లడించారు. గంజాయి అక్రమ కొనుగోలు, రవాణా వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.

