కలం, కరీంనగర్ బ్యూరో: “52 ఏళ్ల అరుణోదయంలో.. 50 ఏళ్ల విమలక్క(Vimalakka) ప్రస్థానం”ను పురస్కరించుకుని ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా కళా జాతరను (Praja Kala Jatara) విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ జిల్లా పూర్వ అధ్యక్షుడు బొల్లం లింగమూర్తి పటేల్, జిల్లా పూర్వ కార్యదర్శి బిజిగిరి నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రజా కళా జాతర కరపత్రాలను అరుణోదయ కళాకారులు, ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 52 ఏళ్ల అరుణోదయ సాంస్కృతిక ప్రస్థానంలో 50 ఏళ్లుగా విమలక్క కొనసాగిస్తున్న ప్రజా కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజా కళా జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపం (నాగన్న ప్రాంగణం)లో మూడు రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
50 గంటల పాటు పాట.. ఆట.. మాట
ప్రజా కళా జాతర(Praja Kala Jatara)లో భాగంగా 50 గంటల పాటు వివిధ కళారూపాలు, పాటలు, ఆటలు, మాటల కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. విమలక్క ఐదు దశాబ్దాలుగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అనేక ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారని, పాట, మాట ద్వారా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సాంస్కృతిక కళాకారుల పాత్ర కీలకమని, ఉద్యమ సందేశాన్ని కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన కళాకారులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజా సమస్యలు, సామాజిక చైతన్యం, ఉద్యమాల నేపథ్యాన్ని కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ జాతర వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రజా కళలు, సాంస్కృతిక ఉద్యమాలతో సుదీర్ఘ అనుబంధం ఉందని, జిల్లాకు చెందిన కళాకారులు, కవులు, గాయకులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ఉద్యమ నాయకురాలు ఓల్లాల వాణి, కళాకారులు పొద్దుపొడుపు శంకర్, దుర్గం మురళి గౌడ్, పల్లె రాజేశం, వెంకటేష్ వెంకీ, గౌడ సంఘం అధ్యక్షుడు కలర్ సత్తన్న, పల్లె నారాయణ గౌడ్, కుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ ఆనంద్, జేఏసీ నాయకుడు కోటేశ్వర్, లింగంపల్లి సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిపల్లి శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సర్దార్ రణధీర్ సింగ్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు కెమంసారం సమ్మయ్య, బీసీ సంక్షేమ సంఘం మైనార్టీ విభాగం కార్యదర్శి మహమ్మద్ అంజద్, జేఏసీ నాయకులు పెద్దపల్లి మధుసూదన్, తోట రాకేష్, కొల్లిపాక శ్రీనివాస్, ఉద్యమకారుల జేఏసీ మహిళా అధ్యక్షురాలు సుహాసిని బిందు, కార్యదర్శి గడ్డం లత తదితరులు పాల్గొన్నారు.
Also Read : మరో భారీ ఉద్యమానికి సీజేపీ ప్లాన్.. ఈ సారి టార్గెట్ ఎవరంటే..!
Follow Us On: X(Twitter)

